బీఎడ్ సిలబస్ పునర్వ్యవస్థీకరణ అనివార్యం: ఆచార్య మృణాళిని
నల్లగొండ టౌన్, మే 14: భవిష్యత్తు భారత నిర్మాణానికి బి.ఎడ్ సిలబస్ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని ఆచార్య మృణాళిని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జరుగుతున్న విద్య వారోత్సవాలలో బిఈడి అధ్యాపకులకు సిలబస్ మూల్యాంకనంపై గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.భవిష్యత్ తరాల తలరాతను మార్చే మహా యజ్ఞంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు.
భవిష్యత్తు భారత నిర్మాణానికి మారుతున్న సామాజిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని సిలబస్ మార్పు అంశాలను ప్రస్తావిస్తూ ఉపాధ్యాయ విద్య ప్రస్తుత సవాళ్లు, అవకాశాలు, నూతన సిలబస్ రూపకల్పన లక్ష్యాలను ఆమె వివరించారు.జాతీయ విద్యా విధానం 2020, కొత్త జాతీయ పాఠ్యాచర్యా పరిపాట్లు ప్రకారం పునర్రూపకల్పన చేయడం ఉపాధ్యాయ విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. బీఎడ్ స్థాయిలో చదువుతున్న విద్యార్థులు రేపటి పాఠశాల ఉపాధ్యాయులు, సమాజ మార్పుకు మార్గదర్శకులు, దీపస్తంభాలు కావాలని ఆమె పిలుపునిచ్చారు. సిలబస్ పునర్వ్యవస్థీకరణతో పాటు దాని అమలులో ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
కొత్త సిలబస్ ఉన్నప్పటికీ దాన్ని తరగతి గదిలో జీవంతంగా మలచే శక్తి ఉపాధ్యాయుల్లోనే ఉందని, వారి బోధనా శైలి, విలువల బోధన, శ్రద్ధ, సహానుభూతి ఉండినప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలు వికసిస్తాయన్నారు. మూల్యాంకనం అనేది కేవలం మార్కుల కేటాయింపుకే పరిమితం కాకుండా విద్యార్థుల అభ్యాస ప్రయాణాన్ని అభివృద్ధి దిశగా నడిపించే సాధనంగా ఉపయోగించాలన్నారు.
ఉపాధ్యాయ వృత్తిని పవిత్రమైన, మహోన్నత వృత్తిగా సంబోధిస్తూ, భవిష్యత్ ప్రపంచాన్ని నిర్మించే మౌలిక శక్తి గురువులేనన్నారు. విద్యార్థుల్లో మానవీయ విలువలు, రాజ్యాంగ స్పూర్తి, సామాజిక న్యాయం పట్ల అంకితభావం పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆమె గుర్తు చేసారు. తదుపరి రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్య సిలబస్ పునర్వ్యవస్థీకరణ ప్రాముఖ్యత, మూల్యాంకనంలో పారదర్శకత, డిజిటల్ వేదికల ద్వారా నిరంతర అభ్యాసం అవసరం అన్నారు .
రేపటి తరాలను తీర్చిదిద్దే భవిష్యత్ గురువులు, తమ వృత్తిని విలువలతో నిండిన మహోన్నత సేవగా భావించి, సమకాలీన జ్ఞానంతో తమను తాము నిరంతరం సన్నద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డా సుజాత , బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్ లు అధ్యాపకులు పాల్గొన్నారు.






