జీసీసీ సంస్థకు పూర్వవైభవం తీసుకురండి
జీసీసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ కోట్నాక తిరుపతి
ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన సహకార సంస్థ జిసిసి సంబంధించిన మౌలిక వసతులను మెరుగుపరచడానికి సంస్థ ను బలోపేతం చేయడానికి తగిన సహకారం అందించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు ను రాష్ట్ర గిరిజన సహకార సంస్థ జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి కోరారు. మంగళవారం ఉట్నూరు ఐటిడిఏ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. గిరిజన సహకార సంస్థ పరిధిలో ఉన్న డిఆర్ డిపోలను ఆధునికరించాలని అవసరమైన నిధులు ఐటిడి ఏ ద్వారా సమకూర్చాలని కోరారు.
దీనికి సానుకూలంగా స్పందించిన ప్రాజెక్టు అధికారి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్ ను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేశారు. అనంతరం ఉట్నూర్ మండల కేంద్రంలోని జీసీసీ డివిజనల్ కార్యాలయాన్ని సందర్శించారు డివిజన్లో జీసీసీ ద్వారా అమలవుతున్న వివిధ రకాల కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డివిజనల్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించటానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ జి. సందీప్ కుమార్, జూనియర్ మేనేజర్ గులాబ్ సింగ్, సిబ్బంది లింబారావు, సత్యనారాయణ, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.






