3 August, 2026 | 3:38 AM

ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గౌరవం

03-08-2026 02:13 AM
  1. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణయే బీజేపీ లక్ష్యం
  2. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ
  3. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై ప్రజల్లో అసంతృప్తి
  4. అమెరికాలోని ఆటా మహాసభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు అపార గౌరవం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ లక్ష్యాల సాధనకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకు బలం పెరుగుతోందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఆదివారం అమెరికాలోని బాల్టిమోర్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సుకు విశిష్ట అతిథిగా రాంచందర్‌రావు హాజరై.. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగించారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే నాణానికి రెండు వైపులాంటివేనని విమర్శించిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. అనేక జాతీయ అంశాల్లోనూ బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారత్‌కు గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని, భారీ ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి వల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయని చెప్పారు.

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కేవలం ఉద్యోగార్థులను తయారు చేయడం కాదని, వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్టాండ్- అప్ ఇండియా, ప్రధాన్ మంత్రి ముద్రా యోజన వంటి కార్యక్రమాల ద్వారా యువతలో వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించామని తెలిపారు. ఫలితంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్ ఎదిగిందని పేర్కొన్నారు. గత ఏడాది నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా స్వదేశీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలతో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని తెలిపారు. 

తెలంగాణకు కేంద్రం సహకారం

2014కు ముందు దేశంలో సుమారు 75 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య రెండింతలకు పైగా పెరిగిందని చెప్పారు. తాజాగా తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అపూర్వ సహకారం అందించిందని, అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడం వల్ల తెలంగాణకు గణనీయమైన ప్రయోజనం చేకూరిందన్నారు.

తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేయడంతో పాటు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ అభివృద్ధి, వరంగల్లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ.5 వేల కోట్లకు పైగా కేటాయింపులు లభిస్తున్నాయని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే ఇంత భారీ కేటాయింపులు లభించలేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 41 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని, ఐదు వందే భారత్ రైళ్లు తెలంగాణకు సేవలందిస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణలో 12 ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పీఎం-కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున నేరుగా జమ చేస్తున్నామని, ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని వివరించారు.