6 May, 2026 | 3:24 AM

ప్రజా దర్బార్ వేదికగా సమస్యల పరిష్కారం

06-05-2026 02:08 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లో పరిష్కారం

రాబోయే నెల రోజులలో సాదా బైనమా భూ సమస్యల 

పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

ఖమ్మం, మే 5 (విజయక్రాంతి): ప్రజా సమస్యల దరఖాస్తులను ప్రజా దర్బార్ కార్యక్రమంలో నేరుగా స్వీకరించి న్యాయబద్ధమైన వాటిని పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళవారం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అధికారులను ప్రజల వద్దకు పంపి దరఖాస్తులు స్వీకరించామని, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రతి క్లస్టర్ లో  10 నుంచి 12 గ్రామాలు ఉండేలా చూసుకుని ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నా మని తెలిపారు. గ్రామ సమస్యలు, ప్రజల వ్యక్తిగత సమస్యలు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.

7 క్లస్టర్ పరిధిలో ఇప్పటి వరకు ప్రజల నుంచి పదివేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. 7 క్లస్టర్ పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 4500 నుంచి 5 వేల వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు వచ్చాయని, 2 వేల దరఖాస్తులు భూ సమస్యలపై వచ్చాయని పేర్కొన్నారు. ధరణి పేరిట అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వీటిని మనం భూ భారతి ద్వారా పరిష్కరించామని, పెండింగ్ ఉన్న సాధా బైనామా దరఖాస్తులు అర్హత ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.

8వ క్లస్టర్ పరిధిలో 9 గ్రామాలకు చెందిన ప్రజలను నేడు పిలవడం జరిగిందని ప్రతి ఒక్కరి నుంచి తానే స్వయంగా దరఖాస్తు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి దరఖాస్తు రికార్డ్ చేస్తామని అన్నారు.

రాబోయే 35 రోజులలో సాదా బైనమా పెండింగ్ దరఖాస్తులు పరిష్కరిస్తామని అన్నారు. గ్రామాలలో ఇండ్లపై నుంచి వెళ్లే 11 కెవి, 33 కేవి విద్యుత్తు లైన్స్ మార్చడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా ఇండ్లపై నుంచి ప్రమాదకరంగా విద్యుత్తు లైన్లు వెళితే వాటిని మార్చేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన నూతన  విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, సబ్ స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని అన్నారు.

అర్హులైన నిరుపేదలందరికీ నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందేలా చూస్తామని అన్నారు.  పదేళ్ల  పాలనలో పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన సొమ్ము అప్పటి ప్రభుత్వం దోపిడి చేసిందని మంత్రి విమర్శించారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు 8వ క్లస్టర్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించు కుంటున్నామని అన్నారు.  7 విడతల్లో దాదాపు పది వేల దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చాయని, వీటిలో అర్హత ఉన్న దరఖాస్తులు పరిశీలించి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసిల్దార్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.