calender_icon.png 8 February, 2026 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీనామా చెయ్!

08-02-2026 01:37:28 AM

కేసీఆర్‌ను అరెస్టు చేసే దమ్ముందా..? లేకపోతే సీఎం పదవినుంచి దిగిపో

నన్ను అడ్డంపెట్టుకొని ఎన్నిరోజులు తప్పించుకుంటావు?.. సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటే ఎవరు వద్దన్నారు?.. రాష్ట్రానికి సీఎం రేవంత్‌రెడ్డా, కిషన్‌రెడ్డా?

కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానన్న మాటలు ఏమయ్యాయి? 

నా మీద, కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయొద్దు 

బీజేపీ అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అవినీతిపై చర్యలుంటాయి : కేంద్రమంత్రి 

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం పదవిలో ఉండి, ఆ బాధ్యతను ఇతరుల మీదకు నెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటామంటే సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డు కున్నదెవరో చెప్పాలని అన్నారు.

కాళేశ్వరం అవినీతి విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేద న్నారు. ‘కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానన్న మాటలు ఏమయ్యాయి? అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌పై ఈగ, దోమ వాలకుండా కాపాడుతున్న వారెవరు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? రాహుల్ గాంధీ అడ్డుకుంటున్నాడా? కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుకుంటున్నదా? ధైర్యం ఉంటే చెప్పాలి.

కేసీఆర్ మాకు అవసరమని చెప్పు.. అంతేతప్ప కిషన్‌రెడ్డి, కేంద్రప్రభుత్వంపై తోసేసే ప్రయత్నం చేయొద్దు. నన్ను అడ్డం పెట్టుకొని  ఇంకా ఎన్నిరోజులు తప్పించుకుంటావు. రాష్ట్రానికి సీఎం రేవంత్‌రెడ్డా.. కిషన్‌రెడ్డా?’ అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం మీ పార్టీకి ఉందా..? రాహుల్ గాంధీ ఈ విషయంలో బహిరంగ ప్రకటన చేయాలి, ఆ దిశగా సీఎంకు రాహుల్ గాంధీ ఆదేశించాలని కిషన్‌రెడ్డి డిమాం డ్ చేశారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అవినీతిపై తప్పకుండా చర్యలు తీసుకుంటా మని, బీజేపీ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. శనివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు.  సమస్యలను తప్పించుకునేందుకు రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన అన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండు సంవత్సరాల మూడు నెలలు పూర్తవుతోందని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఆ హామీల అమలు ఎంత వరకు జరిగిందో చెప్పే ధైర్యం ఆయనకు లేదని తెలిపారు.

అందుకే తమ అసమర్థత, అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, తన ప్రభుత్వంలో మంత్రివర్గ సహచరులు వివిధ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయంలో ఎలా కొట్టుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసని, ఆ అంతర్గత కుమ్ము లాటల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్‌రెడ్డి ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అభివద్ధి గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి, మతపరమైన రిజర్వేషన్ల గురించి మాట్లాడటం దురదష్టకరమని అన్నారు.

ప్రతి ఎన్నికలకు ముందు మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం, మజ్లిస్ ఓట్లు పొందడం కోసం ఎత్తుగడలు వేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసిందని, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా తీర్పు ఇచ్చిందన్నారు. అయినా సుప్రీంకోర్టు స్టేను అడ్డుపెట్టుకుని చట్టబద్ధత లేని 4 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నారన్నారు.

రేవంత్ రెడ్డి మతపరమైన సమావేశం నిర్వహించి ముస్లింలకు శాశ్వతంగా 4 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం పూర్తిగా ఓటుబ్యాంకు రాజకీయాలే అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్’ అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి మాట్లాడిన దిగజారుడు వ్యాఖ్యలను ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ దురదృష్టం ఏమిటంటే.. కాంగ్రెస్ అయినా, బీఆర్‌ఎస్ అయినా.. అధికారంలో ఉన్న పార్టీ మజ్లిస్ కనుసైగల్లో పాలన చేయడమేనన్నారు. 

‘గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్‌పై కేసీఆర్ ఇంటికి వెళ్లారని, అప్పుడు బుల్లెట్ నడిపింది ఓవైసీ.. కూర్చున్నది కేసీఆర్.. ఈరోజు సీట్లు మారాయి గానీ డ్రైవర్ మారలేదన్నారు. బుల్లెట్ నడిపేది ఓవైసీయే, అందులో కూర్చున్నది ఇప్పుడు రేవంత్‌రెడ్డి’ అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

అప్పుడు కేసీఆర్ అయినా, ఇప్పుడు రేవంత్ అయినా.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సత్తా వాళ్లకు లేదని, బీఆర్‌ఎస్-, కాంగ్రెస్ పార్టీలు ఎంఐ ఎం పార్టీకి బానిసలుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘కారు ఎవరిదైనా స్టీరింగ్ తన చేతిలోనే ఉంటుందని గతంలో అసదుద్దీన్ ఓవైసీ చెప్పాడు.. ఈరోజు అక్బరుద్దీన్ కూడా బీఆర్‌ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా తన కాళ్ల దగ్గర ఉండాల్సిందేనని’ అంటున్నారని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపే ఆలోచన అన్నారు.

అడ్డగోలుగా డివిజన్ల విభజన..

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఎలాంటి విధివిధానాలు లేకుండా, ఆధారాలు లేకుండా, తమ పార్టీ ఎమ్మెల్యేల సూచనల మేరకు డివిజన్ల విభజన చేసి, రిజర్వేషన్లను గందరగోళంగా మార్చిందని విమర్శించారు. బీసీలున్న చోట ఎస్సీలకు, ఎస్సీలున్న చోట బీసీలకు, ఎవరూ లేని చోట ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందన్నారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంలో ఎలాంటి తేడా లేదని, మున్సిపాలిటీలకు ఆర్థిక సహకారం ఇవ్వడంలో ఈ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి తెలంగాణను రక్షించాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి కోరారు. 

హార్వర్డ్ వెళ్లొచ్చినా మాట మారలేదు..

హార్వర్డ్ వెళ్లొచ్చినా సీఎం రేవంత్‌రెడ్డి బుద్ధి, హార్డ్ వర్డ్స్ మారలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సంస్కారహీనమైన మాటలు, అడ్డగోలు ఆరోపణలు, రోజుకో కొత్త అబద్ధం, కొత్త వివాదం- ఇదే ఆయన పాలన అని అన్నారు. బీఆర్‌ఎస్, -కాంగ్రెస్ మధ్య డూప్ డైలాగులు నడుస్తున్నాయని, రాజకీయంగా మోదీని ఎదుర్కోలేక ఇలాంటి డ్రామాలు చేస్తున్నారన్నారు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అవినీతిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, బీజేపీ, మోదీ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు.

తన వైఫల్యాలకు బాధ్యత తీసుకోకుండా, మా భుజాలపై బందూకు పెట్టి కాల్చే ప్రయ త్నం చేస్తున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ కూడా తన అసమర్థతను కేంద్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయ త్నం చేశారని చెప్పారు. మాటలతో మభ్యపెట్టి.. కాలం గడిపేయాలనుకుంటే, రేవంత్ రెడ్డిని ఎవ్వరూ రక్షించలేరన్నారు. హేట్ స్పీచ్ చట్టం కింద చర్యలు తీసుకోవాలనుకుంటే.. ముందుగా రేవంత్‌రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవుళ్లను అవమానించడం.. ముస్లిం, కాంగ్రెస్ ఒకటే అనడం ఆయనకు పరిపాటేనని చెప్పారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై అనుమానాలు.. 

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని, ఆ ల్యాబ్‌లోని కంప్యూటర్లలో వందలాది కేసులకు సంబంధించిన కీలక డేటా, టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నిల్వ ఉన్నాయని చెబుతున్నారన్నారు. ఇది అత్యంత తీవ్రమైన విషయమని, ముఖ్యంగా ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి హైప్రొఫైల్ కేసులకు సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ అక్కడ ఉందా? లేదా? అన్నది ప్రభుత్వం వెంటనే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

అందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ఉందా లేదా అనేది స్పష్టంగా ప్రకటించాలని, ఉంటే బ్యాకప్ ఉందా లేదనేది ప్రకటించాలన్నారు. ఇలాంటి హై లెవల్ కేసులకు సంబంధించిన ఆధారాలు ఒకే చోట ఉండి, అదే చోట అగ్నిప్రమాదం జరగడంపై అనేక ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికారికంగా, బాధ్యతతో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.