13 May, 2026 | 6:45 PM

ధాన్యం దిగుమతుల్లో జాప్యం లేకుండా వెంటనే అన్‌లోడింగ్ పూర్తి చేయాలి

13-05-2026 05:31 PM

ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్‌లు అనుమతించొద్దు

సుల్తానాబాద్ లోని పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష  సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, పూసాల, సుగ్లాంపల్లి ప్రాంతాల్లో గల పలు రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం దిగుమతి, అన్‌లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు.

కాట్నపల్లిలోని పల్లా ఇండస్ట్రీస్, శివపార్వతి రైస్ మిల్, రీషి రైస్ మిల్, రంగనాథ రైస్ మిల్, శ్రీ రాజరాజేశ్వరీ రైస్ మిల్, పూసాల శివసాయి రైస్ మిల్, మణికంఠ రైస్ మిల్, సుగ్లాంపల్లి రాధారమణ రైస్ మిల్లులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ  ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్‌లు, అక్రమ కోతలు అనుమతించబోమని స్పష్టం చేశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే స్వీకరించాలని సూచించారు. 

లారీ రైస్ మిల్లుకు చేరిన 24 గంటల్లోపు ధాన్యం అన్‌లోడింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.పీపీసీలు, రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత లేదా ఇతర సమస్యలు ఉన్నచోట వెంటనే అవసరమైన చర్యలు తీసుకొని సమస్యను అధిగమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. ఈ పర్యటనలో డీటీసీఎస్ మహేష్, రవీందర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.