మంజీరలో అక్రమ ఇసుక తవ్వకాలపై తగ్గేల్లి గ్రామస్తుల ఆందోళన
సాలూర,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా సాలురా మండలం తగ్గేల్లి గ్రామ సమీపంలోని మంజీర నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన కొందరు వ్యక్తులు తెలంగాణ పరిధిలోకి ప్రవేశించి జేసీబీల సహాయంతో భారీగా ఇసుకను తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాల కారణంగా నదిలో లోతైన గుంతలు ఏర్పడి రైతులు, పశువులకు ప్రమాదం ఏర్పడుతోందని, గతంలో కూడా ప్రమాదాలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.
అధికంగా ఇసుక తొలగించడం వల్ల భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండగా, ఇసుక నిల్వలు తగ్గిపోవడంతో బోర్లలో నీటి మట్టాలు మరింత తగ్గే ప్రమాదం ఉందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తవ్వకాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను తగ్గేల్లి గ్రామస్తులు కోరారు.






