26 July, 2026 | 4:38 PM

ఉప్పల్ రింగ్‌రోడ్డుపై గ్రీన్ కారిడార్ – మాజీ ఎమ్మెల్యేకు సకాలంలో వైద్యం

26-07-2026 03:24 PM

ఉప్పల్,(విజయక్రాంతి): వరంగల్‌లో గుండెపోటుకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్‌రోడ్డుపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.

అంబులెన్స్ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, మార్గమంతా క్లియర్ చేశారు. పోలీసుల సమన్వయంతో అంబులెన్స్ వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో రోగికి సకాలంలో వైద్య సేవలు అందే అవకాశం లభించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు చేపట్టిన ఈ చర్యలను పలువురు అభినందించారు.