10 August, 2026 | 2:50 AM

ఎండిన కాల్వలో జలకళ.. చిగురించిన పత్తి ఆశలు!

10-08-2026 01:34 AM

పీజేపీ కుడి కాల్వకు నీటి విడుదలతో ఊపిరి పీల్చుకున్న రైతాంగం 

497 ఎకరాల్లో పత్తి సాగు.. కంది, వరి, మిర్చి పంటలకు నీటి ఊతం 

ఇటిక్యాల, ఆగస్టు 9 (విజయక్రాంతి): కొద్దిరోజుల క్రితం వరకు నీటి జాడ లేక బీటలు వారిన జూరాల పీజేపీ కుడి కాల్వలోకి నీరు చేరడంతో ఇటిక్యాల మండలంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. కాల్వలో జలకళ సంతరించుకోవడంతో రైతుల్లో పంటలపై ఆశలు చిగురించాయి. నీటి కొరతతో ఆందోళన చెందిన రైతాంగం ప్రస్తుతం సాగు పనుల్లో నిమగ్నమైంది.

నీటి కోసం ఎదురుచూపులు

వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడంతో ఈ సీజన్ ప్రారంభంలో రైతులు సాగుపై సందిగ్ధంలో పడ్డారు. పీజేపీ కుడి కాల్వకు నీటి విడుదల లేకపోవడంతో ఆయకట్టు పరిధిలోని భూములు సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బోర్లు, బావులపై ఆధారపడి పంటలను సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాల్వలో నీరు.. సాగులో జోరు 

ఇటీవల కాల్వకు సాగునీరు విడుదల కావడంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. కాల్వ పొడవునా నీరు ప్రవహిస్తుండటంతో రైతులు పత్తి సాగుపై దృష్టి సారించారు. మండల వ్యాప్తంగా సుమారు 497 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టినట్లు సమాచారం. ఇటిక్యాల, మొగలిరావుల చెరువు, వావిలాల తదితర గ్రామాల్లో పత్తితో పాటు కంది పంటను కూడా సాగు చేస్తున్నారు. వరి, మిర్చి పంటలకు సైతం కాల్వ నీటి లభ్యత ఊరటనిస్తోంది.

కొనసాగితే మరింత ప్రయోజనం

కాల్వలో నీటి ప్రవాహం కొనసాగితే పంటలకు అవసరమైన సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలమట్టాలు కూడా పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాల్వకు క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసి, సాగు చివరి వరకు నీటి లభ్యత ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు. కాల్వలో నీరు రావడంతో పంటలను కాపాడుకునే ధైర్యం వచ్చింది. నీటి విడుదలను కొనసాగిస్తే పంటలు బాగా పండడంతో పాటు బోర్లు, బావుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉంటుందని ఇటిక్యాల మండల రైతులు పేర్కొన్నారు.