ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణింపు
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల టౌన్: ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు చదువులో రాణిస్తారని, ఫలితంగా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని గద్వాలలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి సాధన చేయాలన్నారు. ప్రణాళిక బద్ధంగా చదివి పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
నులిపురుగుల నివారణకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడి కేంద్రాల చిన్నారులతో పాటు విద్యాసంస్థల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థినిలు న్యూట్రీషన్ సమస్యలు లేకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలతో రక్తహీనతను నివారించవచ్చన్నారు. నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు అనంతరం కలెక్టర్ పలువురు విద్యార్థులకు మాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.






