జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం, హెల్త్ కార్డు, ఉచిత బస్సు పాస్ కల్పించాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు టిడబ్ల్యూజేఎఫ్ వినతిపత్రం
పెద్దపల్లి,(విజయక్రాంతి): జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి పైడాకుల బిక్షపతి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం టిడబ్ల్యూజేఎఫ్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఫ్లకార్డులతో నిరసన చేపట్టి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పైడాకుల బిక్షపతి మాట్లాడుతూ, ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎండనక, వాననక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నప్పటికీ వారి సంక్షేమం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు ఇప్పటికీ తగిన గుర్తింపు, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు పారదర్శకంగా జారీ చేయాలని, అక్రిడిటేషన్ కమిటీల్లో అన్ని జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు పాసులు మంజూరు చేయాలని, కరోనా కాలంలో నిలిచిపోయిన రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత 40 ఏళ్లుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఉచిత ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






