13 July, 2026 | 6:58 PM

ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ

13-07-2026 05:40 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) బేస్‌లైన్ పరీక్షల నిర్వహణపై ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిఎంఆర్సీ ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ పరీక్షల ద్వారా విద్యార్థుల అభ్యాస స్థాయిని ఖచ్చితంగా అంచనా వేసి, వారి అవసరాలకు అనుగుణంగా బోధన చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎస్‌సీఆర్‌పీలు రాథోడ్ రవీందర్, కూడ్మేత అనంత్ బేస్‌లైన్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, రికార్డుల నిర్వహణ, ఫలితాల విశ్లేషణ, విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేసే విధానాలపై ఉపాధ్యాయులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్, మొవాడ్, వాంకిడి పాఠశాల సముదాయాల ప్రధానోపాధ్యాయులు పవార్ లింబారావ్, మాడుగుల నారాయణమూర్తి, సోయం ఇంద్ర మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.