13 July, 2026 | 6:59 PM

గుడుంబా తయారీకి బెల్లం తరలింపు.. 7 టన్నులు పట్టివేత

13-07-2026 05:46 PM

హుస్నాబాద్: గుడుంబా తయారీకి వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్న భారీ బెల్లం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో 7 టన్నుల బెల్లాన్ని సీజ్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎక్సైజ్ సీఐ భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలో గుడుంబా తయారీ చేస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా, హుస్నాబాద్‌లోని కవిత ట్రేడర్స్‌కు చెందిన వెంకటేష్ వద్ద నుంచి బెల్లం కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ సమాచారంతో ఎక్సైజ్ అధికారులు హుస్నాబాద్ పట్టణంలోని నాగులమ్మ ఆలయం సమీపంలో ఉన్న వెంకటేష్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు.

అక్కడ నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెల్లం నిల్వలను ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ భాస్కర్‌రావు తెలిపారు. బెల్లం నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి వినియోగం, సరఫరా వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.గుడుంబా తయారీ, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.