27 June, 2026 | 5:48 PM

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

27-06-2026 04:31 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని అడ్డా కార్మికులు, వివిధ రంగాల అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హింద్ మజ్దూర్ సభ (HMS) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణలు శనివారం మంచిర్యాల జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దుర్గం క్రాంతి కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు, దినసరి కూలీలు లేబర్ కార్డులు లేకుండానే పనులు చేస్తున్నారని, ప్రమాదాలు జరిగినప్పుడు బీమా, ఆర్థిక సహాయం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అడ్డా కార్మికులందరికీ లేబర్ కార్డుల నమోదు చేపట్టాలని, లేబర్ కార్డు లేని కార్మికులను పనిలోకి తీసుకోకుండా మేస్త్రీలు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాల పట్టణంలో అడ్డా కార్మికుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించి షెడ్లు నిర్మించడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్నట్లుగా అడ్డా కార్మికులకు రూ.5కే మధ్యాహ్న భోజనం అందించే పథకాన్ని మంచిర్యాల జిల్లాలో కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. షాపింగ్ మాల్స్, హోటల్స్, షోరూమ్‌లు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం పని వేళలు అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్, కనీస వేతనాలు, ఇతర చట్టబద్ధ హక్కులు తప్పనిసరిగా అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.