29 July, 2026 | 3:29 AM

సీతారామ కెనాల్ బ్రిడ్జికి మరమ్మతులు

29-07-2026 12:00 AM

‘విజయక్రాంతి’ కథనానికి స్పందించిన జాతీయ రహదారుల అధికారులు

బూర్గంపాడు, జూలై 28 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం జింకలగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న సీతారామ కెనాల్ బ్రిడ్జి దుస్థితిపై ’ప్రాణాలు పోతేనే మరమ్మతులా..!’ శీర్షికతో ప్రచురితమైన విజయక్రాంతి ప్రత్యేక కథనానికి జాతీయ రహదారుల అధికారులు స్పందించారు.

ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిపై వెంటనే మరమ్మతు పనులు చేపట్టి గుంతలను పూడ్చివేశారు.బ్రిడ్జిపై కాంక్రీట్ ఊడిపోవడంతో ఇనుప రాడ్లు బయటపడడం, భారీ గుంతల కారణంగా వాహనదారులు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న పరిస్థితిని ’విజయక్రాంతి’ కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది.

ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకర ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు. వర్షాల కారణంగా రహదారి దెబ్బతినడంతో బ్రిడ్జిపై ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాత్కాలికంగా మరమ్మతులు చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం చేపట్టినవి తాత్కాలిక మరమ్మతులేనని, భవిష్యత్తులో మళ్లీ సమస్య తలెత్తకుండా బ్రిడ్జిపై శాశ్వత పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే రహదారి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.