హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు వద్ద దెబ్బతిన్న మ్యాన్‌హోల్స్
తక్షణ మరమ్మతులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాలు
మల్లాపూర్, ఆగస్టు 31: హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు ఇందిరానగర్ వైపు చెరువు కట్ట పక్కన ఉన్న ట్రంక్ లైన్ మ్యాన్‌హోల్స్ దెబ్బతినడంతో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చింది. చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా భారీ వాహనాల రాకపోకల కారణంగా పలు మ్యాన్‌హోల్స్ మూతలు ధ్వంసమవగా, కొన్ని పూర్తిగా కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇందిరానగర్ ప్రాంతంలో డ్రైనేజీ నీరు రివర్స్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు సాయి జెన్ శేఖర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. దెబ్బతిన్న మ్యాన్‌హోల్స్‌ను వెంటనే పరిశీలించి, వాటిలో పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు.
సమస్యపై స్పందించిన జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, జలమండలి ఈడీ పంకజతో మాట్లాడి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్‌హోల్స్‌లో పేరుకుపోయిన పూడికను తొలగించి, దెబ్బతిన్న నిర్మాణాలను పునరుద్ధరించి డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధికారులను కోరినట్లు తెలిపారు. స్థానికులు కూడా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






