రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
గద్వాలలో మరో ఆర్ఓబి నిర్మాణానికి రూ.66 కోట్ల నిధులు
అమృత్ భారత్ పథకం రూ.42.82 కోట్ల నిధులతో గద్వాల స్టేషన్ అభివృద్ధి
శరవేగంగా గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు
గద్వాల రైల్వే స్టేషన్ శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు కృషి
గద్వాల, ఆగస్టు 31: అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరైన రూ.42.82 కోట్ల నిధులతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం గద్వాల రైల్వే స్టేషన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు.
స్టేషన్ కు చేరుకున్న అతిధులకు అధికారులు, పలువురు నేతలు మేళ తాళాలతో, పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా స్టేషన్ అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్లాట్ ఫామ్ పై తిరుగుతూ తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైల్లోనీ ప్రయాణికులకు అభివాదం చేశారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైనుంచి స్టేషన్ పరిసరాల్లో జరుగుతున్న వివిధ పనులను గమనించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గద్వాల రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ పథకం పనులు పూర్తయితే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న రైళ్లకు అదనంగా ఇతర రైళ్ల స్టాపింగ్ కు కృషి చేస్తానన్నారు. స్టేషన్లో ప్లాట్ఫార్మ్స్ విస్తరణ, పార్కింగ్ అభివృద్ధి, నూతన పరిపాలన భవనం, గద్వాల సంస్థానం సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా ముఖద్వారా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గద్వాల రైల్వే స్టేషన్ లో అన్ని రైళ్ళను ప్రయాణికులు సద్వినియోగం చేసుకునేలా స్టాపింగ్ ఉండాలని, ఆధునికీకరణకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు. అలాగే పలువురు ప్రజాసంఘాల నేతలు గద్వాల ప్రాంత అభివృద్ధిని కోరుతూ మంత్రికి వినతి పత్రాలను అందించారు. ఈ పర్యటనలో రైల్వే డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు, తదితరులు పాల్గొన్నారు.






