31 August, 2026 | 3:11 PM

చరవాణే ముద్దు.. ప్రజా సమస్యలు మాకొద్దు

31-08-2026 02:17 PM

ప్రజావాణిలో టైంపాస్ చేస్తున్న అధికారులు 

తూతూ మంత్రంగా ప్రజావాణి

ప్రజావాణికి కొరవడిన స్పందన 

పలు శాఖాల అధికారులు గైర్హాజరు

పాపన్నపేట, ఆగస్టు31: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి, ప్రజలకు దూరభారాలు తగ్గించడానికి  మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్నా అధికారుల నుంచి త్వరగా స్పందన రావడంలేదని, మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు సర్వత్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో ఆర్జీ చేసుకున్న సమస్య త్వరితగతిన పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఆర్జీలు అందించేందుకు ఉత్సాహం చూపడం లేదు. దీంతో ప్రజావాణికి స్పందన కొరవడింది. ఇది ఇలా ఉండగా వచ్చిన అధికారులు టైం పాస్ చేస్తూ ప్రజలకు సేవలు అందించాల్సిన వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. చరవానుల్లో తలామునకలవుతూ ప్రజావాణితో తమకేం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా ప్రజలకు మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారని అవగాహన లేకపోవడంతో వారి సమస్య పరిష్కారానికి ఆర్జీ ఇచ్చేందుకు రావడం లేదని పలువురు విన్నవిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారే తప్ప.. సోమవారం నిర్వహించే ప్రజావాణికి రావడం లేదంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కావడం లేదు. ఐసీడీఎస్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పోలీస్, ఫిషరీస్ శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో ఆ శాఖకు ఆర్జీ పెట్టుకోవాలని వచ్చిన ఆర్జీదారులు వెనుదిరిగి వెళ్తున్నారు.

మండల కేంద్రంలోనే ప్రజావాణి నిర్వహిస్తున్నారని ప్రజలకు అవగాహన లేకపోవడంతో మెదక్ కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెళ్లి ఆర్జీలు సమర్పిస్తున్నారు. ప్రజావాణి పై ప్రజలకు అవగాహన కల్పించి సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తే మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి స్పందన లభిస్తుందని పలువురు విన్నవిస్తున్నారు.