మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య విరుద్ధం
* ఎంపీ మల్లు రవి తీవ్ర ఆగ్రహం
ఆమనగల్లు,(విజయక్రాంతి): మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. శనివారం ఆమనగల్లు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
* పారదర్శకత ఎక్కడ..?
రాజ్యసభ వంటి అత్యున్నత సభల ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత, న్యాయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్లు రవి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పక్షం ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలకు ఒడిగడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం కట్టుబడి పనిచేస్తుందని, ఇలాంటి బెదిరింపులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ అన్యాయమైన నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు... అన్ని ప్రజాస్వామ్య, న్యాయపరమైన మార్గాలను పరిశీలించి, న్యాయపోరాటం చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు.






