విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో సంభవించిన 4.5 తీవ్రత కలిగిన భూకంపం కారణంగా, ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం దానిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తీరప్రాంత నగరమైన విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం సుమారు 5:05 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మంగళపాలెం, సాగర్ నగర్, పెద్ద వాల్తేరు, ఆరిలోవ, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో కూడిన స్వల్ప భూకంపం సంభవించింది. విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 5:05:46 గంటలకు (IST) 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని, దీని కేంద్రం బంగాళాఖాతంలోని కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంప కేంద్రం 16.805 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 84.381 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద నమోదైంది.
భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోణసీమ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు స్వల్ప భూకంపంతో కంపించాయి. 2015 నవంబర్ 4న ఉత్తర కోస్తా ఆంధ్రలోని అల్లూరి జిల్లాలో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఈ ప్రకంపనలు కొన్ని ప్రాంతాల ప్రజలలో భయాందోళనలు కలిగించాయి. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే, దీనివల్ల ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఇతర నష్టం గానీ జరగలేదు. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ (National Center of Seismology) ప్రకారం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి. మాడుగుల వద్ద 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం (epicentre) నమోదైంది. ఈ భూకంప కేంద్రం విశాఖపట్నం ఓడరేవు నగరం నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది.






