ప్రతిభతోనే గుర్తింపు సాధ్యం
జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి
జగిత్యాల, జూన్ 7 (విజయక్రాంతి): ప్రతిభతోనే గుర్తింపు సాధ్యమని జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ కార్యదర్శి అల్లాడి శ్రీనివాస్ లు అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో వాసవి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పబ్బ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సర జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ప్రతిభా పురస్కార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇంటర్, పదవ తరగతి పరీక్షలల్లో అత్యధిక మార్కులు సాధించిన సుమారు 120 మందికి పైగా ఆర్యవైశ్య విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, తల్లిదండ్రులకు శాలువలతో సత్కారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందిస్తూ ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు సమాజ సేవకు ఉపయోగపడే ఉన్నతమైన చదువులు చదవి ఆదర్శంగా ఉండాలన్నారు.
తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకొని రావాలన్నారు. ఉన్నతమైన విద్యతో పాటు లోకజ్ఞానం కలిగియుండాలని సూచించారు. ఈ కార్య క్రమంలో శ్రీ వాసవి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పబ్బ శ్రీనివాస్, జగిత్యాల, మెట్పల్లి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వూటూరి నవీన్, మైలారపు రాంబాబు, ఆర్టీఏ సభ్యుడు కంటాల శ్రీనివాస్, నాయకులు బుడికె శ్రీకాంత్, పల్లెర్ల రాజు, మర్యాల రాజన్న, కట్కం రాజేశ్, భూసం సతీష్,కట్కూరి సంతోష్, బొడ్ల జగదీశ్, చెట్ల పవన్, తదితరులు పాల్గొన్నారు.






