7 May, 2026 | 1:41 AM

జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా ఢమాల్

07-05-2026 12:51 AM

బోథ్, మే 6 (విజయక్రాంతి): ఇటీవల కాలంలో జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా ఆశించినంతగా లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. లక్షలు వెచ్చించి, అసులను కొనుగోలు చేసి, అమ్మకానికిలే ఔట్ లను సిద్ధం చేస్తే, కొనేవారు లేక పెట్టిన పెట్టుబడులు సైతం వెళ్లని పరిస్థితి నెలకొంది.

నూతనంగా ఏర్పాటైన సోనాల మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా చేస్తున్నారు. అయితే స్థానికంగా మంచి డిమాండ్ ఉంటుందని కొంతమంది మధ్య దళారీలు వివిధ ప్రాంతాలలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెప్పడంతో మహారాష్ట్ర. ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుండి వచ్చిన వారు భూములను కొనుగోలు చేశారు. దాదాపు నాలుగున్నర ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుబడును పెట్టి ఇంటి స్థలాలను సిద్ధం చేయడం జరుగుతుంది.

అయితే డిటిపిసి అనుమతులతో చేపడుతున్న... ఈ ప్లాట్ల వ్యాపారం.. పెట్టుబడిదారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగుతుందని అనుకున్నారు. ఆకాశాన్ని అంటిన భూముల ధరలు అకస్మాత్తుగా పడిపోవడంతో పాటు ఇండ్ల స్థలాలకు ధరలు లేకపోవడంతో పెట్టుబడులు పెట్టినవారు ఆందోళనకు గురవుతున్నారు.

అనుమతులు లీగల్ గా ఉన్న మిగతా అంతా ఇల్లీగల్.... డిటిపిసి అనుమతులు తెచ్చుకున్న రియల్ ఎస్టేటర్లు అనుమతులు లేకుండానే అడవుల్లో నుండి మొరం బండరాయిని తీసుకువచ్చి రోడ్లు వేయడం జరిగింది.ఈ భూ మాఫియా తతంగం అంతా చూస్తున్న అధికారులు మాత్రం కళ్ళుండి చూడలేని కబోదులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్లాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం కాకముందే కొంతమంది వ్యాపారులు విక్రయాలకు పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం ఈ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.

కుప్పకూలిన వ్యాపారం...

రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడంతో కొంతమంది వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్లాట్ల ధరలను అందనంత ఎత్తులో ఉండడం వల్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తమ వ్యాపారం ఏ విధంగా సాగుతుందోనని ఆందోళన చేస్తున్నారు. వారికి కొంతమంది రాజకీయ నాయకులు సైతం మేమున్నామంటూ లోలోపల మద్దతునిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.