యశ్ దయాళ్‌ను తప్పించిన ఆర్సీబీ
కాంట్రాక్ట్ మాత్రం కొనసాగింపు
బెంగళూరు, మార్చి 24 : రాయల్ చాలెంజర్స్ బెంగళూ రు జట్టు కీలక ప్రకటన చేసిం ది. తమ పేసర్ యశ్ దయాళ్ ఐపీఎల్ -2026లో పాల్గొనడం లేదని తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడిని పక్కనపె ట్టామని.. అయితే, కాంట్రాక్టు మాత్రం కొనసాగిస్తామని వెల్లడించింది. ఆర్సీబీ తొలిసారి గతేడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోగా..దీనిలో యశ్ దయాళ్ కీలక పాత్ర పోషించాడు. సీజన్ మొత్తం కలిపి 13 వికెట్లతో రాణించాడు.
అయితే, అనూహ్య రీతిలో యశ్ దయాళ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండి పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో ఘజియాబాద్లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తర్వాత 2023 నుంచి తనపై యశ్ దయాళ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద జైపూర్లో మరో కేసు నమోదైంది. ఐపీఎల్- 2025 సందర్భంగానూ హోటల్ గదిలో దయాళ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని సదరు టీనేజర్ ఆరోపించింది.
అయితే, మొదటి కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాళ్ అరెస్టు కాకుండా స్టే విధించగా.. రెండోకేసులో జైపూర్‌లోని పోక్సో కోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను 2025 డిసెంబరులో తిరస్కరించింది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడిని ఈ సీజన్లో ఆడించడం లేదనీ, కాంట్రాక్ట్ మాత్రం కొనసాగుతుందని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ బొబాట్ చెప్పారు.
అతడితో పాటు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.ఇదిలా ఉంటే ఇటీవలే యశ్ దయాళ్ ఇటీవలే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా మార్చి 28న ఐపీఎల్-2026 సీజన్ మొదలుకానుండగా.. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ-, సన్‌రైజర్స్ తలపడతాయి.




