నిబంధనలు నిల్.. బిల్డింగులు ఫుల్!
- తెల్లాపూర్ సర్కిల్లో అక్రమ కట్టడాల జోరు
- హెచ్‌ఎండీఏ నిబంధనలకు పాతర
- అక్రమార్కులకు ‘రెండు చేతులా’ సంపాదన
- కళ్లు మూసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
సంగారెడ్డి/రామచంద్రాపురం, జూన్ 16 (విజయక్రాంతి): ఐటీ హబ్కు అత్యంత సమీపంలో ఉంటూ శరవేగంగా విస్తరిస్తున్న తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దుల్లోని ఈ రియల్ ఎస్టేట్ హాట్స్పాట్లో ఎలాంటి అనుమతులు లేని బహుళ అంతస్థుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిబంధనలను బేఖాతరు చేస్తూ కనీసం వెనక ముందర స్థలాలు కూడా వదలకుండా బిల్డర్లు సాగిస్తున్న ఈ అక్రమ వ్యాపారానికి స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెల్లాపూర్ డివిజన్ సర్కిల్ కార్యాలయం చుట్టుపక్కలే అక్రమ నిర్మాణాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల కళ్ల ముందే పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. సర్కిల్ కార్యాలయం వెనకాలే పదుల సంఖ్యలో నిర్మాణాలు కొనసాగుతుండటంపై స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.
ముఖ్యంగా ఐదు అంతస్థుల వరకు భవనాలు నిర్మితమవుతుండటంతో వాటి అనుమతులు, నిర్మాణ నిబంధనల అమలుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా, నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా అనే అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నిర్మాణాలు నాలా బఫర్ జోన్లను ఆక్రమించి చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీశాయి. బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయా, పర్యావరణ, నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
నోటీసులతో సరి.. చర్యలు శూన్యం
ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా సామాన్యుడిని వేధించే మున్సిపల్ అధికారులు, వందల కోట్ల విలువైన అక్రమ వెంచర్లు, భవనాలు వెలుస్తున్నా మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై స్థానిక కాలనీవాసులు ఫిర్యాదు చేసినప్పుడు.. అధికారులు కేవలం ’షోకాజ్ నోటీసులు’ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆ నోటీసులను అడ్డం పెట్టుకుని బిల్డర్లు కోర్టుల నుండి స్టేలు తెచ్చుకుంటూ నిర్మాణాలను పూర్తి చేసేస్తున్నారని, ఆ తర్వాత వాటిని ‘రెగ్యులరైజ్’ చేయించుకునే కుయుక్తులు పన్నుతున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






