17 June, 2026 | 3:02 AM

దడ పుట్టిస్తున్న ఎరువుల ధరలు.!

17-06-2026 02:16 AM

ముందస్తు కొనుగోళ్లకు రైతుల పరుగులు

అదను చూసి దోచుకుంటున్న ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణ యజమానులు

నాగర్ కర్నూల్ / కల్వకుర్తి జూన్ 15 (విజయక్రాంతి): వానాకాలం సాగు పనులు ప్రారంభమవుతున్న వేళ ఎరువుల ధరలు రైతులకు దడ పుట్టిస్తున్నాయి. పంటలు ఆశించిన దిగుబడులు ఇవ్వాలంటే సేంద్రియ ఎరువులతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం తప్పనిసరి కావడంతో రైతులు భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. నేల సారం తగ్గిపోవడం, అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువుల వినియోగం పెరగడం వల్ల డిమాండ్ మరింత అధికమైంది.

నెల రోజుల వ్యవధిలో మూడింతల ధరల పెంపు.!

కాంప్లెక్స్ ఎరువుల ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో రూ.1,500 ఉన్న కొన్ని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలు ప్రస్తుతం రూ.2,200కు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని ప్రచారం సాగుతుండటంతో రైతులు అప్పులు చేసి మరీ ముందస్తుగా ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. మే తొలి వారంలో 20:20:0:13 కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర రూ.1,500 ఉండగా ప్రస్తుతం రూ.2,150కు చేరింది.

28:28:0:13 ఎరువు ధర రూ.1,900 నుంచి రూ.2,400కు, 14:35:14 ఎరువు ధర రూ.1,850 నుంచి రూ.2,450కు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు పాత నిల్వలను పక్కన పెట్టి కొత్త ధరలతో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం కారణంగా ఎరువుల కొరత ఏర్పడ వచ్చని, ధరలు మరింత పెరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు అవసరానికి మించి ఎరువులను నిల్వ చేసుకుంటున్నారు.

మరోవైపు కొంతమంది వ్యాపారులు కూడా భారీగా నిల్వలు ఉంచి డిమాండ్ పెరిగే సమయంలో విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి సాగులో కీలకమైన డీఏపీ ఎరువు మార్కెట్లో అందుబాటులో లేక పోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. యూరియా, డీఏపీ ధరలు పెరగకపోయినా డీఏపీ కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కొంతమంది వ్యాపారులు పాత నిల్వలను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.

మరోపక్క యూరియా కొనుగోలు చేసేందుకు యూరియా యాప్ ప్రారంభం కాకపోవడంతో సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఎమ్మార్పీ ధరలకే ఎరువుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఎరువుల వినియోగంపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించి అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది.

ఈ వానాకాలం జిల్లా వ్యాప్తంగా పత్తి 3,08,845 ఎకరాలు, వరి 1,92,796, మొక్కజొన్న 96,992,  జొన్న 2,881, కందులు 3,752, ఉద్యాన పంటలు 51,277, ఇతర పంటలు 30,672 మొత్తం: 6,87,215 ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైన యూరియా 66,508, డిఏపి 14,089, పొటాష్ 1,816, సూపర్ 2,265 టన్నులు, కాంప్లెక్స్ 37,203 మొత్తం 1,21,881 టన్నుల ఎరువులు అవసరం పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు  డీఏపీ 438 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 421 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 8,314 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్పీ 862 మెట్రిక్ టన్నులు, యూరియా 12,635 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు

కృత్రిమ కొరత సృష్టించడం అదును చూసి అధిక ధరలకు ఎరువులు విత్తనాలను విక్రయించిన డీలర్లపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసే క్రమంలో ప్రతి రైతు తప్పనిసరి రసీదు పొందాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలకు అన్ని రకాల ఎరువులు విత్తనాలు అందుబాటులోనే ఉన్నాయి. నేడు రేపు యూరియా ఆప్ కూడా అందుబాటులోకి రానుంది.

- యశ్వంత్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నాగర్ కర్నూల్ జిల్లా.