17 May, 2026 | 2:01 PM

విజయ్‌పై నాకెందుకు అసూయ.. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ

17-05-2026 12:53 PM

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తాను సమావేశమయ్యానన్న వదంతులను సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆదివారం తోసిపుచ్చారు. డీఎంకే అధినేతతో తన స్నేహం రాజకీయాలకు అతీతమైనదని, ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్‌పై తనకు అసూయ గానీ, రాజకీయ వ్యతిరేకత గానీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ... తనపై సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ అనేక విమర్శలు చక్కర్లు కొడుతుండటంతోనే తాను బహిరంగంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల సందర్భంలో నాపై అనేక విమర్శలు వచ్చాయని, వాటికి నేను స్పందించకపోతే, అవే నిజమని అందరూ నమ్ముతారన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తాను ఎం.కె. స్టాలిన్‌తో జరిపిన భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదని నటుడు పేర్కొన్నారు. అది కొంత విమర్శకు దారితీసిందని,  స్టాలిన్ నాకు గత 38-40 ఏళ్లుగా మిత్రుడు. మా స్నేహం రాజకీయాలకు అతీతమైనదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. అయినప్పటికీ, స్టాలిన్ ఓడిపోయినందుకు నాకు కాస్త బాధ అనిపించింది. అందుకే, ఒక మిత్రుడిగా నేను ఆయన్ని కలిసినట్లు తెలిపారు. దీంతో విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఎలా అడ్డుకోవాలనే విషయంపై చర్చించడానికి రజనీకాంత్ అక్కడికి వెళ్లారని ప్రచారం జరుగుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రజనీకాంత్ అంత దిగజారుడు మనిషి కాదని వ్యాఖ్యానించారు. 

విజయ్ గెలిచిన వెంటనే, నేను ఎక్స్ వేదికగా నా అభినందనలు తెలియజేశాను. నేను రాజకీయాల్లో లేను. నేను ఇప్పటికే రాజకీయాల నుండి వైదొలిగాను. నేను రాజకీయాల్లో లేనప్పుడు, అతని పట్ల నేను ఎందుకు అసూయపడాలి?... ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటుందో అది జరుగుతుంది. అసూయ ఆరోపణలను కొట్టివేస్తూ, విజయ్ రాజకీయ ఎదుగుదలను ప్రశంసించారు. నాకూ విజయ్ కి మధ్య 25 ఏళ్ల తరం అంతరం ఉందని, ఈ విషయాన్ని నేను ఇంతకు ముందే చెప్పాను. ఒకవేళ నేను నన్ను విజయ్‌తో పోల్చుకుంటే, అది నాకు మంచిది కాదు. అలాగే విజయ్ తనను నాతో పోల్చుకుంటే, అది అతనికి మంచిది కాదు. అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను అతన్ని చూస్తున్నాను. మరి అతను ముఖ్యమంత్రి అయినందుకు నేను ఎందుకు అసూయపడాలి?", ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయి ఉంటే అసూయ పడేవాడిని అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ కన్నా విజయ్ ఎక్కువ సాధించారని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు.