నీట్ పేపర్ లీక్ కేసు.. మనీషాకు సీబీఐ కస్టడీ
న్యూఢిల్లీ: నీట్-యుజీ (NEET-UG) ప్రశ్నపత్ర లీకేజీ కేసులో జీవశాస్త్ర అధ్యాపకురాలు మనీషా మంధారేకు 14 రోజుల సీబీఐ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం ఆదివారం మంజూరు చేసింది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన మంధారేను, సీబీఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. సీబీఐ ఆమె కస్టడీని కోరగా, మంధారే తరపు న్యాయవాది ఆమె అరెస్టు అక్రమమని వాదించారు.
కస్టడీలో ఉన్న సమయంలో మంధారేను రోజుకు 15 నిమిషాల పాటు కలిసేందుకు అనుమతించాలని ఆయన కోర్టును కోరగా, అందుకు సమ్మతించింది. అయితే, నిందితురాలైన ఆ ఉపాధ్యాయురాలిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ అభ్యర్థనను మాత్రం కోర్టు ఆమోదించింది. నిందితురాలు మనీషా గురునాథ్ మంధారేకు వైద్య పరీక్షలు నిర్వహించాలనే షరతుతో, ఆమెను 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తున్నామని, ఆమెను మే 30 తేదీన సంబంధిత న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని న్యాయస్థానం తన ఉత్తర్వులలో పేర్కొంది.






