20 May, 2026 | 3:46 AM

బుడ్డోడి విధ్వంసం

20-05-2026 12:36 AM

రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం

లక్నోపై ఘనవిజయం

జైస్వాల్, జురెల్ మెరుపులు

ఒకే ఒక ప్లే ఆఫ్ బెర్త్ కోసం ఐదు జట్లు పోటీపడుతున్న వేళ రాజస్థాన్ రాయల్స్ జూలు విదిల్చింది. లక్నోతో జరిగిన కీలక పోరులో అదరగొట్టింది. భారీ టార్గెట్‌ను ఛేదించి ప్లే ఆఫ్ అవకాశాలను నిలబెట్టుకుంది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించిన వేళ, జైస్వాల్, జురెల్ కూడా తోడవడంతో సునాయాసంగా గెలిచింది. 

జైపూర్, మే 19: ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఇంగ్లీస్, మిఛెల్ మార్ష్ దుమ్మురేపారు. రాజస్థాన్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలోనే లక్నో 83 పరుగులు చేసింది. తొలి వికెట్ కు వీరిద్దరూ 8.2 ఓవర్లలో 109 పరుగుల భాగస్వామ్యం నెలకొ ల్పారు. ఇంగ్లీస్ 29 బంతుల్లోనే 60 (7 ఫో ర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయగా.. తర్వాత పూరన్ (16) త్వరగానే వెనుదిరిగాడు. ఈ దశలో మిఛెల్ మార్ కు రిషబ్ పంత్ జత కలిసాడు. తన ఫామ్ కొనసాగించిన మార్ష్ సెంచరీ చేసేలా కనిపించాడు.

చివర్లో సైతం భారీ షాట్లు బాదేసిన మార్ష్ 57 బంతుల్లోనే 96( 11 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల దగ్గర రనౌటయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ పైనా 90 పరుగులకు ఔటై శతకం చేజార్చుకున్నాడు. చివరి ఓవర్లో మిచెల్ మార్ష్‌కు స్ట్రైక్ ఇచ్చే క్రమంలో పంత్ రనౌట్ కాగా.. ఐదో బంతికి మార్ష్ రనౌటయ్యాడు. ఆఖరి బంతికి ఆయుష్ బదోని క్లీన్‌బౌల్ అయ్యాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఒక దశలో లక్నో జోరు చూస్తే 240 ప్లస్ స్కోరు చేసేలా కనిపించింది. అయితే రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 

రాజస్థాన్ బౌలర్లలో యశ్‌రాజ్ పూనియా 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తామని స్పష్టత ఉన్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ చావోరేవో అన్న తరహాలోనే ఆడింది. పరాగ్ లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన జైస్వాల్ తొలి ఓవర్ నుంచి రెచ్చిపోయాడు. పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువ పరుగులు చేసే లక్ష్యంతో బ్యాటింగ్ కొనసాగించాడు. వైభవ్ తో కలిసి తొలి వికెట్ కు 75 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో 23 బంతుల్లో 43 (8 ఫోర్లు,1 సిక్సర్) పరుగులకు వెనుదిరిగాడు. జైస్వాల్ ఔటైన తర్వాత ఛార్జ్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ లక్నో బౌలర్లను ఉతికారేశాడు. తన దైన బ్యాటింగ్ తో వారిని ఎడాపెడా బాదేశాడు. బౌలర్లను మార్చినా కూడా బుడ్డోడిని కట్టడి చేయడంలో లక్నో చేతులెత్తేసింది. జురెల్, వైభవ్ కేవలం 45 బంతుల్లోనే 105 పరుగులు జోడించారు. ఒక దశలో వైభవ్ విధ్వంసం చూస్తే మరో సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే భారీ సిక్సర్ కొట్టబోయి వికెట్ సమర్పించుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు.  

వైభవ్ స్కోరులో 88 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. బుడ్డోడు ఔటైనా ధృవ్ జురెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లో 53 నాటౌట్‌గా నిలిచా డు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ఈ గెలుపుతో రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

స్కోరు బోర్డు

లక్నో ఇన్నింగ్స్ : 220/5 (మార్ష్ 96, ఇంగ్లీస్ 60, పంత్ 35 ; యశ్ రాజ్ 2/35, ఆర్చర్ 1/39)

రాజస్థాన్ ఇన్నింగ్స్ : 225/3 (వైభవ్ సూర్యవంశీ 93, జురెల్ 53 నాటౌట్, జైస్వాల్ 43 ; ఆకాశ్ 1/54, మోసిన్ ఖాన్ 1/31)