1 June, 2026 | 3:30 AM

నూతన సీడీఎస్‌గా రాజా సుబ్రమణి

01-06-2026 02:46 AM

నేవీ అడ్మిరల్ చీఫ్‌గా స్వామినాథన్ 

న్యూఢిల్లీ, మే 31: భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. ఆదివారం ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో తోటి అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన దేశానికి తొలి జనరల్ బిపిన్ రావత్, రెండవ జనరల్ అనిల్ చౌహాన్ తరువాత మూడవ సీడీఎస్ సుబ్రమణి. దీంతో మిలటరీ థియేటరైజేషన్ బాధ్యతలను ఇక నుంచి సుబ్రమణి పర్యవేక్షించనున్నారు.

జనరల్ రాజా సుబ్రమణి చైనా, పాకిస్థాన్ అంశాల్లో నిపుణుడిగా సైనిక వర్గాల్లో పేరుంది. ఆయన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌కు మిలిటరీ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజా బాధ్యతల్లో ఆయన ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్స్ ఏర్పాటుతో.. థియేటరైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం శనివారంతో ముగిసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో సీడీఎస్ రాజా సుబ్రమణి మాట్లాడారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలు కాపాడటానికి సైనిక దళాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయన్నారు. దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

రాజా సుబ్రమణి..

ఎన్.ఎస్. రాజా సుబ్రమణి 1985 డిసెంబర్‌లో గర్హాల్ రైఫిల్ నుంచి సైన్యంలో నియమితులయ్యారు. ఎన్‌ఐఎ నుంచి సైనిక శిక్షణ పొందారు. బ్రిటన్‌లోని బ్రాక్నెలో జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీకి వెళ్లారు. భారత్‌కు తిరిగొచ్చాక పర్వత బ్రిగేడ్‌లో మేజర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీలోని జాతీయ రక్షణ కళాశాలలో చదువుకున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ ఆరట్స్ డిగ్రీని మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫీల్ పట్టాను పొందారు.

సుబ్రమణి దాదాపు 40 సంవత్సరాలుగా సైన్యంలో సేవలందిస్తున్నారు. 2025లో జాతీయ భద్రతా మండలి సచివాలయంలో సైనిక సలహాదారుగా పనిచేశారు. జూలై 2024 నుంచి జూలై 2025 వరకు ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. జమ్మూ కశ్మీర్లోని సాంబాలో 168వ పదాతిదళ బ్రిగేడ్‌కు  కమాండర్‌గా పనిచేశారు. సుబ్రమణికి పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం, విశిష్ట సేవా పతకం లభించాయి.

నేవీ చీఫ్ అడ్మిరల్‌గా స్వామినాథన్..

నేవీ చీఫ్ అడ్మిరల్‌గా స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించారు. డీకే త్రిపాఠీ పదవీకాలం శనివారంతో ముగియడంతో స్వామినాథన్ ఈ బాధ్యతలను స్వీకరించారు. వెస్ట్రన్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించనున్నారు.