1 June, 2026 | 3:28 AM

ఎండలతో జాగ్రత్త !

01-06-2026 02:43 AM
  1. శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేసుకోండి
  2. పగటిపూట అత్యవసరమైతేనే బయటకు రండి
  3. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ సూచనలు

న్యూఢిల్లీ, మే ౩౧: దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రమయ్యాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఎప్పటికప్పుడు శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలని, అందుకు తరచూ నీరు తాగాలని కోరారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన యావత్ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడారు. పగటి పూట అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అనంతరం మోదీ ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ గురించి వివరించారు.

ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తున్నదని కొనియాడారు. గంగా నదిలో ఆవాసం ఉండే గంగ డాల్ఫిన్ల జాతిని సంరక్షించడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని తెలిపారు. అనారోగ్యం పాలైన డాల్ఫిన్లకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాజాగా ఓ డాల్ఫిన్‌కు వైద్యం చేసి కాపాడిన ఘటనను ప్రస్తావించారు. డాల్ఫిన్ జాతిని కాపాడుకోవడమంటే, కేవలం జీవులను రక్షించినట్టు కాదని, నదీ జీవ వైవిధ్యాన్నీ కాపాడినట్లని అభిప్రాయపడ్డారు.

పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఎంతో మంది పనిచేస్తున్నారని, వారందరికీ తన తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేరళకు సజీ వలస్సేరిల్ అనే వ్యక్తి గురించి వివరించారు. పిల్లల కోసం సజీ ఉచిత స్విమ్మింగ్ క్లబ్ నడుపుతున్నాడని, దివ్యాంగ పిల్లలతో సహా ఇప్పటివరకు ౧౫,౦౦౦ మందికి ఈత నేర్పాడని కీర్తించారు. అంతేకాకుండా.. అన్ని వయస్సుల వారికి స్వయం రక్షణ నైపుణ్యాలు నేర్పుతున్నాడని కొనియాడారు.

సమాజ సేవకు పెద్దగా వనరులు అవసరం లేదని, సహాయం చేయాలనే మంచి సంకల్పం ఉంటే చాలని ప్రధాని అన్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని మనోరమ నదిని పునరుజ్జీవం కోసం పనిచేస్తున్న ఆకాష్ గుప్తా, అతని బృందాన్ని ప్రస్తావించారు. ఈ బృందం నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నారని కొనియాడారు. గోవాకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ కృషిని కూడా ప్రధాని శ్లాఘించారు.

బాలకృష్ణ మద్ది-తోలాప్ ప్రాంతంలో పైప్‌లైన్లు వేయించి, స్థానిక ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారని కీర్తించారు. అలాగే, క్రీడలు, సాంస్కతిక వారసత్వం, సైన్స్ రంగాల్లో దేశం సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. రాంచీలో ఇటీవల జరిగిన స్ప్రింటర్ ఫెడరేషన్ కప్ పోటీలో భారత క్రీడాకారులు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజుర్‌ను అద్భుతమైన ప్రతిభ కనబరిచారని కొనియాడారు. ప్రధాని ఈ సందర్భంగా స్వయంగా వారికి కాల్ చేసి ప్రశంసల జల్లు కురిపించారు.

‘సువర్ణరేఖ’ మామిడి ప్రస్తావన

మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్‌లో పండే ‘సువర్ణరేఖ’ మామిడిపండ్ల గురించి ప్రస్తావించారు. వాటి రుచి అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, బంగినపల్లి, తోతాపురి, నీలం, మల్గోవా రకాలు కూడా పసందుగా ఉంటాయని వివరించారు. ఏపీలోని విజయవాడ రామ లింగేశ్వరపేట పండ్ల మార్కెట్ సువర్ణరేఖ మామిడి పండ్లకు ప్రసిద్ధి అని కొనియాడారు. ఆ రాష్ట్రంలో అత్యధికంగా ఈ రకం మామిడిపండ్లే సేల్ అవుతాయని తెలిపారు.