18 July, 2026 | 2:25 AM

గద్వాలలో కురిసిన వర్షాలు..

18-07-2026 02:16 AM

గద్వాల టౌన్ జూలై 17: ఎన్నో రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గద్వాల జిల్లాపై ఎట్టకేలకు వరుణుడు కరుణ చూపాడు. శుక్రవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో మంచి వర్షం కురవడంతో రైతులు, ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాలు లేక సాగు పనులు నిలిచిపోవడంతో ఆందోళనకు గురైన రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. తేమ పెరగడంతో వ్యవసాయ పనులు వేగవంతం కానున్నాయని, ఖరీఫ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా వర్షాలు కురవాలని జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు తమ తమ సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయాల్లో యాగాలు, హోమాలు, శివాలయాల్లో అభిషేకాలు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, మసీదుల్లో దువాలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కురిసిన వర్షం ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పలువురు తమ ప్రార్థనలు ఫలించాయని భావిస్తుండగా మరికొందరు ఈ వర్షం రైతాంగానికి కొత్త ఆశలు, వ్యవసాయానికి నూతన ఊపునిస్తుందని అభిప్రాయపడుతున్నారు.