12 July, 2026 | 2:53 AM

రైల్వే గేట్‌మెన్ నిర్లక్ష్యం?

12-07-2026 01:14 AM

మహబూబాబాద్, జులై 11 (విజయక్రాంతి): రైల్వే గేట్‌మెన్ నిర్లక్ష్యంతో ముంచుకొచ్చిన ప్రమాదం ఓ లోకో పైలట్ అప్రమత్తతో తప్పింది. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ  రైల్వే మార్గంలో మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని 75వ లెవెల్ క్రాసింగ్ గేట్ మెన్ శనివారం తెల్లవారుజామున గేటు మూసి రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆకస్మికంగా రద్దు (ఫుట్ బ్యాక్) చేశాడు. దీంతో రెడ్ సిగ్నల్ పడడంతో విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వెళుతున్న స్పెషల్ ట్రైన్(18527) లోకో పైలెట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి అత్యవసర బ్రేకులు వేయడంతో అప్పటివరకు వేగంగా వెళుతున్న రైలు ఒక్కసారిగా ఉన్నఫళంగా నిలిచిపోయింది.

దీంతో నిద్రలో ఉన్న పలువురు ప్రయాణికులు భారీ కుదుపులకు గురై ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో లోకో పైలట్ అదే వేగంతో ముందుకెళితే పెద్ద ప్రమాదం జరిగేదని చెబుతున్నారు. అయితే ఈ సంఘటనపై ప్రయాణికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రైల్వే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్, సిగ్నలింగ్ ఇన్‌స్పెక్టర్ రామ్కి, చీఫ్‌లకు ఇన్‌స్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో త్రీ మెన్ కమిటీ ద్వారా మహబూబాబాద్‌లో విచారణ నిర్వహించారు.