17 August, 2026 | 4:10 AM

సీబీఐ వలలో రైల్వే ఇంజినీర్

17-08-2026 01:14 AM
  1. 15 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
  2. నాలుగు ప్రాంతాల్లో సీబీఐ అధికారుల సోదాలు

అమరావతి, ఆగస్టు 16: దక్షిణ మధ్య రైల్వే సీనియర్ ఇంజినీర్ రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా సీబీఐ అధికారులకు చిక్కాడు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల వ్యవహారంలో 15 లక్షలు డిమాండ్ చేసిన ఇంజినీర్ బాపిరాజుతోపాటు శ్రీచందన్ అనే మరో వ్యక్తిని కూడా ఆదివారం సీబీఐ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితునికి సంబంధించిన విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్ నివాసాలు, ప్రాంగణాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

రూ. 179.50 కోట్ల ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ప్రాజెక్టును పొందిన గణపతి ఇంజనీరింగ్ వర్క్, యెల్లా కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పనులను ముందుగానే పూర్తి చేసినందుకు గాను రూ. 7 కోట్ల బోనస్‌ను క్లుయిమ్ చేశాయి. బోనస్‌కు ఆమోదం తెలిపేందుకు విజయవాడలోని దక్షిణ మధ్య రైల్వే, చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీర్ బాపిరాజు రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో సంస్థ నిర్వాహకులు సీబీఐని ఆశ్రయించారు.