19 June, 2026 | 6:25 PM

ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ కృషి ఆదర్శనీయం

19-06-2026 05:06 PM

* ప్రభుత్వ విప్ : ఆది శ్రీనివాస్

* కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడని అన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమని కొనియాడారు. రాజన్న స్వామి ఆశీస్సులు రాహుల్ గాంధీపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

దేశంలో అసమానతలు రూపుమాపడమే రాహుల్ గాంధీ లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్రలు నిర్వహించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని అన్నారు. పేద ప్రజలకు న్యాయం జరిగేలా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీపై రాహుల్ గాంధీ రాజీలేని పోరాటం చేస్తున్నారని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే కాంగ్రెస్ శ్రేణుల సంకల్పమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.