19 June, 2026 | 7:31 PM

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

19-06-2026 06:15 PM

ఈ నెల 20 న జరిగే బహిరంగ సభకు వేలాది గా తరలిరండి

CPM  జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపు

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి):తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాల్గవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈనెల 20,21,22 తేదీలలో మూడు రోజులపాటు మహబూబ్ నగర్ లో జరగనున్నాయని, శనివారం అనగా 20 వ తేదీన మధ్యాహ్నం మున్సిపల్ టౌన్ హాల్ నుండి భారీ ప్రదర్శన ఉంటుందని, ప్రదర్శన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఎంబీసీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.

ఈ మహాసభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సహా అగ్ర నాయకులంతా హాజరు కానున్నారని తెలిపారు. మహాసభలలో గత మూడు సంవత్సరాలలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు చేసిన పోరాటాలు సమీక్షించి, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి దానిని ఒక పథకంగా మార్చి ప్రజలకు ఉపాధిని దూరం చేస్తున్న యూనియన్ గవర్నమెంట్ విధానాలను సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల కాలంలో భూమిలేని పేదల కోసం చేసిన పోరాటాలను, పోరాట ప్రజల పట్ల ప్రభుత్వం అనుసరించి విధానాలను సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. మహాసభలకు జిల్లాలోని వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొడ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.