17 August, 2026 | 10:12 PM

నాగుల పంచమి వేల.. కొండచిలువ కలకలం

17-08-2026 09:18 PM

గంభీరావుపేట, ఆగస్టు 17 (విజయక్రాంతి): నాగుల పంచమి పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కొండచిలువ ప్రత్యక్షమై స్థానికంగా కలకలం రేపింది. మండల కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం తోట సమీపంలో ఈ భారీ కొండచిలువ కనిపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, ఫారెస్ట్ అధికారి జ్యోతి సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని రిస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కొంతసేపు శ్రమించి 8 ఫిట్లున్నా కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేందుకు తరలించారు.

ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి జ్యోతి మాట్లాడుతూ, కొండచిలువలు కనిపించినప్పుడు ప్రజలు భయంతో వాటిని చంపేందుకు ప్రయత్నించకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాములు సహా వన్యప్రాణులను ఇబ్బంది పెట్టకుండా వాటి సంరక్షణకు సహకరించాలని కోరారు.నాగుల పంచమి రోజునే కొండచిలువ కనిపించడంతో ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది. కొండచిలువను చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడం గమనార్హం.