6 March, 2026 | 4:41 AM

జనంలోకి సర్కార్

06-03-2026 02:52 AM

నేటి నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక

గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించనున్న అధికారులు 

ప్రజల నుంచి ఆర్జీల  స్వీకరణ

ఇప్పటికే రెండుసార్లు ప్రజలతో మమేకమైన ప్రభుత్వం 

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి) : తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం మరోసారి ప్రజల్లోకి వెళ్లనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇప్పటికి రెండుసార్లు ప్రజల్లోకి వెళ్లిన ప్రభుత్వం.. ఇప్పుడు 99 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నుంచి మూడోసారి జనంలోకి వెళ్లేందుకు సిద్దమవుతుంది.

‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణకు నడుం బిగించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థా యి వరకు అయిదు స్థాయిల్లో  ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతోంది.

సీఎం రేవంత్‌రెడ్డి పాలన పగ్గాలు చేపట్టాక 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి 2024 జనవరి 6 వరకు  ప్రజా పాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించింది. ఆ తర్వాత 2025 జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు రెండోసారి ప్రజా పాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించింది.  ఇప్పటికే గ్రామసభలు, వార్డు సభలతో నేరుగా ప్రజా ప్రభుత్వం  ప్రజలకు చేరువైంది. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి నుంచి అర్జీలు స్వీకరించటంతో పాటు ప్రజలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.

రెండు విడతల్లోనూ ప్రజల సమక్షంలో వచ్చిన అర్జీలతోనే ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసింది. అక్కడ తీసుకున్న అర్జీల ఆధారంగానే రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ. సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు రూ. 500 బోనస్ పథకాలను అమలు చేసింది.

ప్రజలకు పథకాలు, అభివృద్ధి వివరించనున్న ప్రభుత్వం..  

మూడోసారి జనంలోకి వెళ్లనున్న ప్రభుత్వం గత రెండేళ్లుగా  ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటితో లబ్ధి పొందిన కుటుంబాలు, వర్గాలకు చేసిన మేలును క్షేత్ర స్థాయిలో చెప్పుకోవటంతో పాటు.. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు తప్పకుండా అందించాలనే సం కల్పంతో ఈ సభలను ఏర్పాటు చేశారు. 

మార్చి 6 నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతో పాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది.

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణ యించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. 

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను ప్రజలకు వివరించనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించే 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను గుర్తిం చి, పిల్లల తల్లితండ్రుల్లో అవగాహన పెంచనుంది. 

గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణతో పాటు మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సరికొత్త కార్యాచరణకు నడుం బిగించింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. 

విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్తు, ప్రధానంగా సోలార్ విద్యుత్తు వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆదా యం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయా లనేది లక్ష్యంగా ఎంచుకుంది. 

ఖాళీ స్థలం నుంచి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలనే ప్రజా ప్ర భుత్వ లక్ష్యాన్ని నూటికి నూరు పాళ్లు అమలయ్యేలా చూడాలని సంకల్పించింది. పదేండ్లుగా ఇవ్వని రేషన్‌కార్డు లను.. అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ఇదో నిరంతర ప్రక్రియగా అమలు చేయాలని నిర్ణయించింది. 

యువతకు నైపుణ్యాల శిక్షణతో పాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో చేపట్టనుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి. లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది టార్గెట్ గా ఎంచుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారా భివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది. అన్ని జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది. 

99 రోజుల ప్రణాళిక షెడ్యూల్.. 

1వ వారం - గ్రామీణ అభివృద్ధి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 )

2వ వారం - ఆరోగ్య రంగం (ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11)

3వ వారం - అరైవ్.. ఆలైవ్ ( ఏప్రిల్13 నుంచి ఏప్రిల్ 18)

4వ వారం -  సంక్షేమం ( ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 వరకు)

5వ వారం -  పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27 నుంచి మే2)

6వ వారం -  రైతు సంక్షేమం (మే 4 నుంచి మే 9 వరకు)

7వ వారం - విద్య (మే 11 నుండి మే 16 వరకు)

8వ వారం -  యువత, క్రీడలు  (మే 18 నుంచి మే 23 వరకు)

9వ వారం - మహిళా సంక్షేమం ( మే 25 నుంచి మే 30)

10వ వారం - పర్యావరణం (జూన్1 నుంచి జూన్ 6)