కేంద్ర వ్యతిరేక విధానాలపై నిరసనలు
రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ నీట్ పేపర్ లీకేజీ, పెట్రోల్ ధరల పెంపు వంటి అనేక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తెలిపారు. ఆదివారం శివచరణ్‌రెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్‌లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ సయ్యద్ ఖాలీద్ అహ్మద్, సహ ఇంఛార్జులు రోషిని కుషాల్ జైస్వాల్, కేఆర్ భవ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమాల్లో భాగంగా జూన్ 3న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






