ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ధర్నాను విజయవంతం చేయండి
టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు
పిఆర్సీ ప్రకటన వచ్చేవరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన
ఏన్కూర్,(విజయ క్రాంతి): ఈనెల 27వ తేదీన ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల టీజీ జెఏసి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు చేపడుతున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు కోరారు. ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట, బురద రాఘవాపురం, ఏన్కూర్ కాంప్లెక్స్ సమావేశంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రామ్ చంద్, మూడ్ పుల్లయ్య, పిఆర్టియు నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, టిజిటిటి ఎఫ్ నాయకులు హతీరామ్, తఫాస్ సంఘ నాయకులు బి.సేవియా టిజీటిఎఫ్ నాయకులు నరసయ్య అధ్యక్షతన జరిగిన వివిధ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయుల ఉద్దేశించి టీజీ జెఎసి నాయకులు మాట్లాడారు.
సమస్యల పరిష్కారం కోసం టీజీ జెఏసి నాయకత్వంలో పోరాటాలకు పిలుపును ఇచ్చినందున పోరాట కార్యాచరణను విజయవంతం చేయాలని తెలియజేశారు. జూన్ రెండున ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండు నెలలు గడిచిన ప్రధాన డిమాండ్లు పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ సక్రమంగా అమలు కాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈహెచ్ఎస్ ను సమర్ధవంతంగా అమలు చేయాలని, రెండవ పిఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి అమలు చేయాలని, ఆరు పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలి. సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని, 2004 సెప్టెంబరు ఒకటో తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారికి ఓపిఎస్ అమలు చేయాలని కోరారు. విద్యాశాఖలో రేషలైజేషన్ కు సంబంధించిన జీవో 25ను సవరించాలని, టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి.
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పండిట్స్ పిఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ పదోన్నతులు కల్పించాలని, సిఆర్ టి ల సర్వీసును క్రమబద్ధీకరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 27న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, సెప్టెంబర్ 1వ తేదీన విద్రోహ దినం నల్లబ్యాడ్జీలతో నిరసన, సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ లో మహాధర్న చేపడుతున్నట్లు తెలియజేశారు. అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలియజేశారు.






