చదువుతోనే ఉన్నత భవిష్యత్తు
విద్యార్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచన
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. విద్యార్థుల నుంచి వారి విద్యా సమస్యలు, కళాశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరమైన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ విద్యార్థి దశే జీవితానికి బలమైన పునాది అని, ఈ సమయంలో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. సాంకేతిక విద్య ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకుని, భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అలాగే చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని, సమయాన్ని వృథా చేయకుండా చదువు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ను కళాశాల సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.






