పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాలి
నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా
భూపాలపల్లి: పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాలని, నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా, అన్నారు. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా, ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, డీఐజీకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, ఆయుధాగారం, సిబ్బంది క్రమశిక్షణ, విధుల నిర్వహణ తదితర అంశాలను డీఐజీ పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు, సంక్షేమ అంశాలను తెలుసుకున్నారు. సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించి నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు వాటిని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాలని, రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్ 2.0, ఈ-సాక్ష్య, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బంది నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు.
మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సీఐ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణకాటారం సీఐ నాగార్జునరావు, మహాదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






