జీవో 97ను రద్దు చేయాలి
నంగునూరు,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలను 'శక్తి' స్కీమ్ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగుల ఆందోళనలు నాలుగో రోజుకు చేరగా, మరోవైపు జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భారీ ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ జేఏసీ పిలుపు మేరకు గురువారం రాజగోపాలపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిబ్బంది నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలుపుతూ తెచ్చిన జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని, విలీనం వల్ల నాణ్యమైన పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్య కనుమరుగై, పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.






