23 April, 2026 | 4:42 PM

బాలెన్ షా సర్కార్‌కు నిరసన సెగ

23-04-2026 12:00 AM
  1. అట్టుడికిన ఖాఠ్మాండు సింఘా దర్బార్
  2. విద్యార్థి సంఘాల రద్దుపై భగ్గుమన్న విద్యార్థిలోకం
  3. భారత్ నుంచి దిగమతయ్యే వస్తువులపై పన్ను విధింపు పైనా వ్యతిరేకత

ఖాఠ్మాండు, ఏప్రిల్ 22: నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి, భారీ మెజారిటీతో అధికార పీఠాన్ని అధిరోహించిన బాలెన్ షా సర్కార్‌కు నెల తిరగకముందే నిరసన సెగ తగిలింది. ఖాఠ్మాండులోని దేశ పరిపాలన కేంద్రమైన ‘సింఘా దర్బార్’ను ముట్టడించేందుకు బుధవారం విద్యార్థులు, వ్యాపారులు యత్నించారు. విద్యార్థిలోకం ఎక్కడికక్కడ యూనిఫాంలోనే నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.

ప్రధాని బాలెన్ షా విద్యార్థి సంఘాలను రద్దు చేయడం, భారత్ నుంచి వచ్చే వస్తువులపై అదనపు కస్టమ్స్ డ్యూటీ విధించడం వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే ఈ నిరసనలకు కారణం. భారత్ నుంచి వంద రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులను తీసుకువస్తే, వ్యాపారులు కచ్చితంగా పన్ను చెల్లించాలన్న నిబంధన వ్యాపారులకు ఆగ్రహం తెప్పించింది. తమ బతుకుదెరువును దెబ్బకొట్టడాన్ని వ్యాపారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

సరిహద్దు ప్రాంత ప్రజలు నిత్యావసరాల కోసం భారత్‌పైనే ఆధారపడతారని, ఇప్పుడు ఆ వస్తువులపై పన్ను విధించడం ఎంతవరకు సబబు అని ప్రశిస్తున్నారు. అలాగే, విద్యార్థులు కూడా అదే స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏరికోరి ఎన్నుకుంటే బాలెన్ షా విద్యార్థి సంఘాలను రద్దు చేయడమేంటని నిలదీస్తున్నారు. విద్యార్థి సంఘాల రద్దు, కస్టమ్స్ విధింపు నిర్ణయాన్ని బేషరతుగా ప్రధాని ఉప సంహ రించుకోవాలని విద్యార్థు లు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

ఒకప్పుడు, ఖాఠ్మండు మేయర్ గా పనిచేసి, ప్రజాస్వామికవాదిగా పేరుగడించిన బాలెన్ షా ఇప్పుడిలాంటి ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోవడమేంటని నిలదీస్తున్నాయి. మరోవైపు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం మంత్రి సుదాన్ గురుంగ్ తక్షణం రాజీనామా చేయాలని అక్కడి విపక్షాలు, పౌర సమాజం పట్టుబడుతున్నాయి. మంత్రి గురుంగ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయనకు ఆర్థిక నేరగాళ్లతోనూ సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నాయి.