కాల్పుల విరమణ పొడిగింపు
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
- పాక్ ప్రధాని షరీఫ్, సైన్యాధిపతి మునీర్ అభ్యర్థన మేరకే నిర్ణయం
- తమపై హఠాత్తుగా దాడి చేసేందుకే: ఇరాన్
- హోర్ముజ్‌లో ఐఆర్‌జీసీ దూకుడు.. రెండు నౌకలు స్వాధీనం
వాషింగ్టన్/ టెహ్రాన్, ఏప్రిల్ ౨౨: ఇరాన్‌తో కాల్పుల విరమణ(సీజ్‌ఫైర్)ను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. నిన్నమొన్నటి వరకు ఇరాన్‌కు వేరే మార్గమే లేదని, దేశానికి చర్చలొక్కటే మార్గమని ప్రకటించిన ట్రంప్ తాజాగా అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ప్రత్యేక అభ్యర్థన మేరకే తాను నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అతి త్వరలో శాంతిచర్చలకు ఆస్కారం ఉందని, వచ్చే ౩౬ నుంచి ౭౨ గంటలోనే జరగవచ్చని కూడా ముక్తాయించారు. పాక్ ప్రధాని షరీఫ్ నేరుగా తనకు కాల్ చేసి సీజ్‌ఫైర్ కోరినట్లు పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా నిర్ణయంపై ఇరాన్ తనదైన శైలిలో స్పందించింది. ట్రంప్ కాల్పుల విరమణ నిర్ణయాన్ని తాము నిర్దద్వంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పింది. తమ దేశంపై హఠాత్తుగా మెరుపు దాడి చేసేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడే కాల్పుల విరమణ అని, అదొక ఆర్థికపరమైన ఆయుధం (ఎకనామికల్ వెపన్) అని పేర్కొంది.
తమ ఓడరేవుల దిగ్బంధ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా కాల్పుల విరమణ ఎందుకని నిలదీసింది. ఓడరేవుల దిగ్బంధాన్ని తాము యుద్ధం కిందే పరిగణిస్తామని తేల్చిచెప్పింది. నౌకల రవాణా నౌకలను అడ్డుకోవడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని మండిపడింది.
ఓడరేవుల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేసే వరకు జలసంధి తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిపై పూర్తి అజమాయిషీ తమదే ఉంటుందని ఉద్ఘాటించింది. ఏదేమైనా, తాజా పరిణామాల రీత్యా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ బృందం కూడా పాక్ పర్యటనను రద్దు చేసుకుంది.
రెండు నౌకలను స్వాధీనం చేసుకున్న ఇరాన్
హోర్ముజ్ జలసంధి వద్ద బుధవారం ఇరాన్ రాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) రెండు నౌకలపై దాడి చేసి స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి గ్రీస్‌కు చెందిన నౌక కాగా, మరొకటి భారత్‌లోని గుజరాత్ తీరానికి రావాల్సిన నౌక. ఇకపై ఏ దేశానికి చెందిన నౌకనైనా విడిచిపెట్టేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది.
మరోవైపు, ఈ ఉద్రిక్తల ప్రభావం అంతర్జాతీయ విమానయాన రంగంపై పడింది. ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే జర్మనీకి చెందిన లుఫ్తాన్సా గ్రూప్’ అక్టోబర్ వరకు సుమారు 20 వేల విమాన సర్వీసులను రద్దు చేసింది. మున్ముందు అంతర్జాయ మార్కెట్‌పైనా ఉద్రిక్తల ప్రభావం పడనుందని విశ్లేషకులు చెప్తున్నారు.






