24 June, 2026 | 1:43 AM

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

24-06-2026 12:41 AM

డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ డిమాండ్

ఖైరతాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందుకు అధికారంలోకి వచ్చే ముందుకు నిరుద్యోగులకు అనేక హామీలనిచ్చింది. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చి, నిరుద్యోగ యువత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందన్నారు. కానీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడం లేదన్నారు. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా ప్రకటించడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చూడాలన్నారు. పోలీసు శాఖలో కేవలం ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సరిపోదని ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

నిరుద్యోగ యువత జీఓ 46 కారణంగా నష్టపోతున్న నేపథ్యంలో దాన్ని తక్షణమే సవరించాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయడంపాటు నిమాయకాల క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, రిక్రూట్మెంట్ ప్రక్రియలపై స్పష్టతనివ్వాలని కుండబద్ధలుగొట్టారు. తమ వినతులను పరిష్కరించని నేపథ్యంలో నిరుద్యోగ యువతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గద్దెనెక్కిచ్చిన తమకు, గద్దె దించడం కూడా తెలుసని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రా నాయక్, చెర్రీ ప్రవీణ్, ఆకాశ్ గౌడ్, నవీన్ పట్నాయక్, శింబు నాయక్, భూక్యా కుమార్, ప్రవీణ్, రాజు, జనార్దన్, గూగులోతు సూర్యప్రకాశ్, సంతోష్, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు.