24 June, 2026 | 2:47 AM

ఘనంగా శ్రీ గురుపీఠం వార్షికోత్సవం

24-06-2026 01:41 AM

దత్తాత్రేయ పంచాయతనం, గురుపరంపర ప్రతిష్ఠలతో ఆధ్యాత్మిక శోభ

వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించిన శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులు

శివంపేట, జూన్ 23: శివ్వంపేట మండల కేంద్రంలోని గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ గురుపీఠంలో ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం, కలియుగ దత్తావతారుల గురుపరంపరలోని శ్రీ వేదవ్యాస మహర్షి, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ గజానన మహారాజ్, శ్రీ వాసుదేవానంద సరస్వతి, శ్రీ సాయినాథ మహారాజ్, శ్రీ కృష్ణతులసి, శ్రీ సమర్థ రామదాసు, శ్రీధర మహారాజ్ విగ్రహాలతో పాటు పంచవటి ఆది వృక్షాలు, శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా చేపట్టారు.

షిరిడి సాయిబాబా దేవాలయ పురోహితులు శాస్త్రుల వామన్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ గురుపీఠం ఫౌండర్, ట్రస్ట్ చైర్మన్ పెద్దగౌని శివకుమార్ గౌడ్ దంపతులు వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం సంకల్పం, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, పంచగవ్య ప్రాశనం, నవగ్రహవాస్తు మండప ప్రతిష్ఠ, ప్రధాన దేవతా మండపం, సర్వతోభద్ర మండప స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం దత్తాత్రేయ స్వామి, సాయిబాబా మూలమంత్ర హోమాలు, నవగ్రహ హోమం, వాస్తు హోమం, సర్వతోభద్ర మండప హోమాలు నిర్వహించారు. సాయంత్రం ప్రదోష మహాపూజ, విశేష హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సభ్యులు పెద్దగౌని శివకుమార్ గౌడ్, ట్రస్ట్ చైర్మన్ రమాదేవి, సూర్యంకుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వై. రాజారమణ గౌడ్, పబ్బ మహేష్ గుప్తా, మారెళ్ల మోహన్రావు, నోముల హనుమంతు, రాజ్యం బిక్షపతి, శాస్త్రుల వామన్ శర్మ, శ్రీహర్ష శర్మ, నటరాజ్ శర్మ, గ్రామ సర్పంచ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.