24 June, 2026 | 2:47 AM

పాత కక్షలతో ఇద్దరు బలి..

24-06-2026 01:43 AM

చిన్నశంకరంపేట్ మండలం సూరారంలో జంట హత్యలతో  తీవ్ర ఉద్రిక్తత.. 

పోలీసుల ఆధీనంలో గ్రామం

చిన్నశంకరం పేట/చేగుంట, జూన్ 23: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం సూరారం గ్రామంలో పాత కక్షలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకరి హత్యకు ప్రతీకారంగా మరో హత్య జరగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు గ్రామంలో భారీగా బలగాలను మోహరించి గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, సూరారం గ్రామానికి చెందిన **యాట శ్రీధర్ (25)**ను అదే గ్రామానికి చెందిన రనబోయిన ప్రభాకర్ సోమవారం రోజు చేగుంట మండలం అన్నంతసాగర్ గ్రామంలో ఆటోతో ఢీకొట్టి హత్య జరిగింది, ఈ ఘటన పాత కక్షల నేపథ్యంలో జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. శ్రీధర్ మృతితో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రతీకార దాడి చోటుచేసుకుంది.

శ్రీధర్ కుటుంబ సభ్యులుగా పేర్కొంటున్న యాట లక్ష్మణ్, దిడ్డికాడి లింగం, యాట కిషన్లు ప్రభాకర్ తండ్రి **రనబోయిన యదగిరి (60)**ని వెంబడించి పట్టుకుని బండరాయితో దారుణంగా హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని మాసాయిపేట మండలం కొప్పులపల్లి సమీపంలోని హల్దీ ప్రాజెక్టు ప్రాంతంలో పడేసినారు. ఒకేరోజు జరిగిన ఈ రెండు హత్యలతో సూరారం గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు. రెండు ఘటనలపై పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యలకు దారితీసిన అసలు కారణాలు, ఘటనల క్రమం, ఇందులో పాల్గొన్న వారి పాత్రపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినారు. ఈ వరుస హత్యలు మెదక్ జిల్లాలో కలకలం రేపగా, గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలు శాంతిని పాటించాలని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.