28 July, 2026 | 2:24 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములను చేయండి

28-07-2026 01:51 AM

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు.. ఎమ్మెల్యే జీఎంఆర్ 

పటాన్చెరు, జూలై 27 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని.. పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలంటే అర్హత కలిగిన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలు సమర్పించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని పిఎస్‌ఆర్ గార్డెన్స్ లో ఎస్‌ఐఆర్ అంశం పైన  ముత్తంగి డివిజన్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఆశించిన మేరకు జరగడంలేదని పేర్కొన్నారు.

ఆదివారం సాయంత్రం వరకు 61.21 శాతం మాత్రమే నమోదు కావడం జరిగిందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలు బిఆర్‌ఎస్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే అవకాశం ఉందని.. ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పాండు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు ఉపేందర్, శ్రీకాంత్, కుమార్ గౌడ్, శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, కొమరయ్య, రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఎన్యూమరేషన్ ఫారం సమర్పణ..

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఓటరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి సంబంధిత ఎన్నికల అధికారులకు అందచేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.