భూగర్భ గనుల్లో 99 శాతం ఉత్పత్తి
- డీజిల్ కొరతతో ఓసీల్లో తగ్గిన ఉత్పత్తి
నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని భూగర్భ గనులలో 99 శాతం ఉత్పత్తి జరిగినట్లు ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఏప్రిల్ నెలలో సంస్థ సాధించిన పురోగతిని వివరించారు. 2026 - 27 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల అయిన ఏప్రిల్ లో సాధించని ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఈ సందర్భంగా తెలిపారు.
శ్రీరాంపూర్ ఏరియా మార్చి నెల ఉత్పత్తి లక్ష్యం 5,47,500 టన్నులకు గాను 3,07,200 టన్నులు సాధించినట్లు తెలిపారు. ఒక్క IK 1A గని మినహా శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని మిగిలిన ఐదు భూగర్భ గనులు వంద శాతం ఉత్పత్తి సాధించాయన్నారు. వీటిలో SRP - 1 గని 123 శాతం, RK NT 104 శాతం, RK 5 గని 102 శాతం, SRP 3, RK 7 గనులు 100 శాతంతో ఓవరాల్ గా భూగర్భ గనులు 99% ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ప్రైవేట్ కాంట్రాక్ట్ ఒప్పంద సమస్యలు, డీజీల్ కొరత కారణంగా ఓసీలలో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగలేదన్నారు.
కాగా ఎస్ఆర్పీ ఓసీలో ఇప్పటికే ఒక సంస్థ పనులు కొనసాగుతున్నాయనీ, మరొక సంస్థ పనుల ప్రారంభం కావాలని, ఐకే ఓసీకీ సైతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం నిర్దేశించిన 64 లక్షల 30 వేల టన్నుల టార్గెట్ సాధనకు ఈసారి ముందస్తు ప్రణాళికలతో అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా లక్ష్య సాధనకు కృషిచేస్తామన్నారు.
గనుల వారీగా అధికారులు, మైనింగ్ స్టాఫ్, మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, ఉద్యోగులతో కలిసి ఉత్పత్తి సాధనే లక్ష్యంగా సమీక్షాసమావేశాలు పెట్టి గురువారం మొదటి సమావేశం RK 5 గనిలో నిర్వహించామన్నారు. ఏప్రిల్ లో భూగర్భ గనుల్లో మంచి ఉత్పత్తి జరగగా, రానున్న రోజుల్లోనూ భూగర్బ గనుల్లో అదే ఒరవడి కొనసాగిస్తూ ఉపరితల గనుల్లోనూ సమస్యలు చక్కదిద్ది నూటికి నూరు శాతం ఉత్పత్తి సాధనకు కృషిచేస్తామన్నారు.
కారుణ్యనియామకాల ప్రక్రియ ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులకు 3,828 మందికి ఉద్యాగాలు కల్పించటం జరిగిందని, 277 మంది ఉద్యోగులకు ఎల్‌ఎస్‌పీ (SLP) చెల్లింపు, 21 మందికి ఎంఎంసీ (MMC) చెల్లించటం జరిగిందన్నారు. ఉద్యోగ విరమణ పొందిన 9,751 మంది ఉద్యోగులకు CPRMS క్రింద శ్రీరాంపూర్ ఏరియాలో మెడికల్ కార్డులు అందజేశామన్నారు.






