వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దాడులు
కేసముద్రం,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగుతోందని కేసముద్రం మండల(Kesamudram Mandala) బీజేపీ అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పొదిల నరసింహారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్, నల్గొండ బీజేపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా కేసముద్రంలో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ(BJP) శ్రేణుల భారీ నినాదాలు చేస్తూ నిందితులను శిక్షించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ రౌడీ మూకల దాడి అత్యంత దుర్మార్గమైనదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీజేపీపై భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






